: మరణ శిక్షల అమలు 54 శాతం పెరిగింది.. మొదటి మూడు దేశాల్లో చైనా, ఇరాన్, పాకిస్థాన్
ప్రపంచ వ్యాప్తంగా మరణశిక్షల అమలుపై 2015 సంవత్సరపు నివేదికను లండన్లోని మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. 2015లో మరణ శిక్షల అమలు సంఖ్య 54 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. మరణ శిక్షల అమలులో చైనా, ఇరాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, అమెరికా మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. చైనా దాదాపు వేయికి పైగా మరణశిక్షలు అమలు చేసి అమ్నెస్టీ నివేదికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇరాన్ 977 మరణశిక్షలను అమలు చేసి చైనా తర్వాతి స్థానంలో నిలిచింది. అమ్నెస్టీ ప్రకటించిన నివేదికలో 90 శాతం మరణ శిక్షలు కేవలం మూడు దేశాల్లోనే అమలయ్యాయని పేర్కొంది. ఇందులో 326 మందిని ఉరితీసిన పాకిస్థాన్ కూడా ఒకటిగా నిలిచింది. 2012లో ఈ గణాంకాల నుంచి చైనాను అమ్నెస్టీ మినహాయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 2012లో ప్రపంచ వ్యాప్తంగా 682 మరణ శిక్షలు అమలు కాగా, 2013లో 778మందికి మరణశిక్షలు అమలయ్యాయి. 2014లో 22 దేశాల్లో 1,061 మరణశిక్షలు అమలయ్యాయి. 2015లో 61 దేశాల్లో 1,998 మరణ శిక్షలు అమలయ్యాయని అమ్నెస్టీ పేర్కొంది. మరణశిక్ష అమలు మానవ హక్కులకు విరుద్ధమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చాలా కాలం నుంచి ఉద్యమం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు మరణశిక్షలను తమ చట్టాలనుంచి తొలగించాయి.