: ఎంతగా ప్రయత్నించినా ప్రాణాలు కాపాడుకోలేక పోయాడు... సీసీటీవీలో దృశ్యాలు
ప్రాణాల కోసం ఎంతగా ప్రయత్నించినా విఫలమై మృతువు ఒడిలోకి చేరాడో వ్యక్తి. ఇటీవల న్యూఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరిన ముప్పై రెండేళ్ల సిద్ధార్థ శర్మ అనే వ్యక్తి.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే రోడ్డు క్రాస్ చేయాలని చూశాడు. అయినా తనపైకి అతి వేగంగా ఒక కారు దూసుకొచ్చింది. అది గమనించిన సిద్ధార్థ కారును తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ముందుకు పరుగుతీశాడు. కారువేగం ముందు తన ప్రయత్నం విఫలమైంది. కారు అతనిని ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరి పడ్డాడు. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి. ఆ తర్వాత కూడా కారు స్లో అవ్వలేదు. చివరికి టైరు పగిలిపోవడంతో కారు ఆగిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షలు ముగిశాయన్న సంతోషంలో స్నేహితులతో కలిసి అతి వేగంతో కారుని నడుపుతూ ఈ ప్రమాదం చేశాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దీనిపై పోలీసులు ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారని సిద్ధార్థ్ తండ్రి హేమ్‌రాజ్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మైనర్‌కు వాహనం ఇచ్చి, ప్రమాదానికి కారణమైన విద్యార్థి తండ్రిపై బెయిలబుల్ అభియోగాన్ని మాత్రమే పోలీసులు పెట్టారు.