: అందరికీ తెలిసిన ఏటీఎంల గురించి చాలా మందికి తెలియని నిజాలు!


మనలో చాలా మందికి... కాదు అందరికీ ఏటీఎం మెషీన్ల గురించి తెలుసు. దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఎలా భాగమైపోయిందో, ఏటీఎంలకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా అంతే సాధారణమైపోయింది. ఏటీఎం మెషీన్ల గురించి కొన్ని నిజాలివి... 4 డిజిట్ పిన్ నంబర్ ఎందుకు?: దీని వెనుక ఓ ఆసక్తికర వాస్తవముంది. దాన్ని గురించి తెలుసుకోవాలంటే, 1960లో ఏటీఎంను కనిపెట్టిన షెపర్డ్ బారన్ జీవితంలోకి వెళ్లాలి. తొలుత ఆయన ఆరు అంకెల పిన్ నంబర్ ను పెట్టాలనుకున్నాడు. తన భార్యకు కేవలం నాలుగు అంకెలు మాత్రమే గుర్తుంటాయని తెలుసుకుని, నాలుగు అంకెలతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మరింత సురక్షితం కోసం ఆరంకెల పాస్ వర్డ్ ను అమలు చేస్తున్నాయి. బంగారాన్ని అమ్మే ఏటీఎంలు: ఏటీఎంల నుంచి డబ్బు మాత్రమే కాదు. బంగారం, బంగారు ఆభరణాలు కూడా డెలివరీ అవుతాయి. అబూదాబీలోని ఎమిరేట్స్ ప్యాలెస్ లో 320 రకాల బంగారు వస్తువులను డెలివరీ ఇవ్వగల ఏటీఎం మెషీన్ ఉంది. యూఎస్ తో పాటు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, బ్రిటన్ దేశాల్లోని విమానాశ్రయాల్లో బంగారాన్ని విక్రయించే మెషీన్లున్నాయి. తేలియాడే ఏటీఎం: నీళ్లపై తేలియాడే ఏటీఎం కేరళలోని కొచ్చి జిల్లాలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసింది. ఎర్నాకుళం, వ్యాపీన్ ప్రాంతాల మధ్య తిరిగే ఓ ఫెర్రీపై దీన్ని అమర్చారు. ఏటీఎం మొత్తాన్నీ దొంగలు తీసుకెళితే...: ఈ తరహా ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఏటీఎం మెషీన్లను దోపిడీ దొంగలు తీసుకువెళితే, వారిని పట్టుకోవడం చాలా సులువు. ఎందుకంటే వీటిల్లో జీపీఎస్ ఆధారిత చిప్ పనిచేస్తుంది. అదిచ్చే సమాచారంతో మెషీన్ ఎక్కడుందో సులువుగా తెలుస్తుంది. డబ్బు ఎక్కువగా డ్రా అయ్యేది ఏరోజంటే..? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే, అత్యధికులు శనివారమో, ఆదివారమో అని సమాధానం ఇస్తారు. కానీ శుక్రవారం నాడు ఏటీఎంల నుంచి అధిక మొత్తంలో నగదు విత్ డ్రా అవుతుంది. ఏటీఎం కార్డు లేకుండా విత్ డ్రా: ఈ సదుపాయం ఇండియాలో లేదు. అయితే, రొమేనియాలో బ్యాంకు ఖాతా ఉంటే చాలు... ఏటీఎంల నుంచి డబ్బు తీసుకెళ్లొచ్చు. త్వరలో మనకూ ఈ సదుపాయం వస్తుంది. ఇండియాలో తొలి ఏటీఎం: ముంబైలో 1987లో ఇది ప్రారంభమైంది. హాంకాంగ్ అండ్ షాంగై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్ఎస్బీసీ) దీన్ని ప్రజలకు పరిచయం చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఏటీఎం: ఇది కూడా ఇండియాలో ఉంది. సినో-ఇండియా సరిహద్దుల్లో సముద్రమట్టానికి 14,300 అడుగుల ఎత్తున ఉన్న నాథుల్లా పాస్ వద్ద దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఆర్మీ వారికి, టూరిస్టులకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరూ వాడని ఏటీఎం: దీన్ని అంటార్కిటికాలో మనం చూడవచ్చు. యూఎస్ రీసెర్చ్ సెంటర్ మెక్ ముర్డో స్టేషన్ లో దీన్ని అమర్చారు. ఇక్కడ రెండు ఏటీఎంలు ఉండగా, ఒకటి కేవలం బ్యాకప్ కోసమే వాడుతారట.

  • Loading...

More Telugu News