: కరుణానిధిపై వైగో బూతు పురాణం... ఆనక బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం


తమిళనాడులో వేడెక్కిన రాజకీయాల్లో నిన్న బూతు పురాణం వినిపించింది. డీఎంకే చీఫ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై ఎండీఎంకే నేత వైగో బూతుల వర్షం కురిపించారు. తన అభిమాన రాజకీయ నేతగా చెప్పుకునే కరుణానిధిపైనే వైగో తిట్ల దండకం అందుకోవడంతో తమిళ తంబీలతో పాటు మీడియా కూడా నివ్వెరపోయింది. వివరాల్లోకెళితే... నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైగో... డీఎంకేపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పై ఆయన సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు జరిగేలా డీఎంకే వ్యూహం పన్నిందని ఆయన ఆరోపించారు. ఇందుకోసం డీఎండీకే నేతలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల చొప్పున తాయిలాలు ఎరవేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ వర్గానికి చెందిన కరుణానిధిని టార్గెట్ చేస్తూ వైగో ‘‘ఈ నైచ్యం ఎలా ఉందంటే... క్షురకులు పడుపు వృత్తి చేపట్టినట్టు ఉంది. నాదస్వరం (కరుణ పూర్వీకులు దేవాలయాల్లో నాదస్వరం వాయిస్తూ జీవనం సాగించేవారు)తో ఎవరిని ఎలా ఆడించాలో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో తేరుకున్న ఆయన... కరుణకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘‘నా రాజకీయ గురువైన కరుణను, ఆయన కులాన్ని కించపరిచే వ్యాఖ్యలతో జీవితంలోనే పెద్ద తప్పు చేశాను. నేను ఎటువంటివాడినో కరుణకు బాగా తెలుసు. ఆయనపై విమర్శలకు నేనే వణికిపోయాను. జీవితంలో నేను చేసిన పెద్ద నేరంగా దీనిని భావిస్తున్నాను. అందుకే ఆయనకు క్షమాపణ చెబుతూ... పితృభావనతో మన్నిస్తారని భావిస్తున్నాను’’ అని వైగో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News