: ఇండియా అంటే కేవలం హిందువులదేనా?: బాంబే హైకోర్టు ఆగ్రహం
నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశం కేవలం హిందువుల కోసమే అని మీ ఉద్దేశమా? అని ప్రశ్నించింది. నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా చదివించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంత మంది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు, 'కేవలం హనుమాన్ చాలీసానే చదివించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఖురాన్ లేదా బైబిల్ వంటి ఇతర మతాల సాహిత్యం ఎందుకు ఉపయోగించకూడదని అనుకుంటున్నారు? అయినా ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమానికి హనుమాన్ చాలీసాకి సంబంధం ఏంటి? ఈ అవగాహన కేవలం హిందువుల కోసమేనా? భారతదేశం అంటే కేవలం హిందువులేనా?' అని ప్రశ్నలు కురిపించింది. తమకు ఏ మతంపైనా అభిమానం లేదా వ్యతిరేకత లేవని, ఈ రెండు కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించాలని సూచించింది. రెండింటికి మధ్య కనీసం గంట వ్యవధి ఉండేలా చూడాలని న్యాయస్ధానం ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు ప్రజాసంబంధ అంశాల కోసం పని చేయాలని న్యాయస్థానం హితవు పలికింది.