: నాడు మంత్రి హోదాలో కట్టించిన జైలు గదిలోనే.. నేడు నిందితుడిగా మహారాష్ట్ర నేత!
పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం, ఓడలు బండ్లు అవడమంటే ఇదే నేమో! ఒక ఉగ్రవాదిని జైలులో ఉంచేందుకుగాను ప్రత్యేక సెల్ నిర్మాణపు బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించిన ఒకప్పటి మంత్రి... అనంతర పరిణామాల నేపథ్యంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, ఏ జైలు గదినైతే దగ్గరుండి కట్టించారో అదే జైలు గదిలో నిందితుడిగా ఉండవలసి రావడం దురదృష్టమో లేక యాదృచ్చికమో! ఇంతకీ, ఆ నిందితుడు ఎవరంటే ... మహారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్ బల్. మనీలాండరింగ్, మహారాష్ట్ర సదన్ కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ జైలు గది గురించి చెప్పాలంటే... 26/11 ముంబయి పేలుళ్ల కేసులో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ కోసం ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో బరాక్ 12 పేరుతో ప్రత్యేకంగా ఒక గది నిర్మించారు. అయితే, ప్రజా పనుల విభాగంలో నాడు మంత్రిగా ఉన్న భుజ్ బల్ ఈ జైలు గది నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కాగా, మనీలాండరింగ్, మహారాష్ట్ర సదన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న భుజ్ బల్ ప్రస్తుతం అదే జైలు గదిలో ఉండాల్సి వచ్చింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కాగా, ఇదే జైలు గదిలో షీనా బోరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జీ కూడా ఉన్నారు. ఆయనకు ప్రతిరోజూ ఇంటిభోజనం వస్తుంది. ఈ భోజనాన్ని భుజ్ బల్ కూడా షేర్ చేసుకుంటున్నారని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కసబ్ ను ఎరవాడ జైలుకు పంపే వరకు అతనిని ఇదే సెల్ లో ఉంచారు. ఇప్పుడు బరాక్ 12 ను మరిన్ని సెల్స్ గా విభజించారు. హైప్రొఫైల్ నిందితులను వాటిలో ఉంచుతున్నారు.