: అనితకు క్షమాపణలు చెప్పిన రోజా!
టీడీపీ ఎమ్మెల్యే అనితకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా క్షమాపణలు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరయ్యారు. ‘సభలో టీడీపీ నేతలు నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు. నా మాటలు అనితకు బాధకలిగించి ఉంటే క్షమించాలి’ అని ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాతో గంటసేపు చర్చించి వివరణ తీసుకున్నట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. రోజా ఇచ్చిన వివరణను, దానిపై తమ నివేదికను త్వరలోనే స్పీకర్ కు ఇస్తామని వెల్లడించారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, రోజా క్షమాపణలు చెప్పారని, ఆమె చెప్పిన విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకువెళతామన్నారు.