: హీరోయిన్ల దగ్గర లెక్కలేనంత డబ్బున్నా, వాళ్లు పనిమనుషుల కంటే హీనం: మహేష్ భట్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఘటన సందర్భంగా బాలీవుడ్ లో ఆత్మహత్యకు పాల్పడిన నటీమణులపై పెద్ద చర్చ నడుస్తోంది. 'లవ్ గేమ్స్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసహనం వెళ్లగక్కే భాగస్వాముల నుంచి మహిళలు విముక్తి పొందేందుకు ఆర్ధిక స్వాతంత్ర్యం దోహదపడుతుందని తాను భావించేవాడినని అన్నారు. అయితే సినీ పరిశ్రమలో తాను ఎంతో మంది నటీమణులను చూశానని, వారి వద్ద ఊహించలేనంత డబ్బుందని అన్నారు. మహిళలు, మహిళా సాధికారత గురించి వారు అద్భుతంగా మాట్లాడేవారని ఆయన చెప్పారు. వాళ్లు చెప్పే సూక్తుల కోసం చాలా మంది ఎదురు చూసేవారని ఆయన అన్నారు. ఇంత అద్భుతంగా చెప్పిన వాళ్లు తమ వ్యక్తిగత జీవితంలో ఎంత హింస ఎదుర్కొన్నారంటే...పని మనుషులు కూడా అంతటి అరాచకాన్ని ఎదుర్కొని ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. బలహీనమైన బంధాలను చాలా మంది వదిలేసుకుంటుండగా...పలువురు హీరోయిన్లు మాత్రం బీటలుబారుతున్న బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.