: బస్టాండ్ లోనే తగలబడిపోయిన ఇంద్ర ఏసీ బస్సు... ప్రయాణికులు సురక్షితం
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో కొద్దిసేపటి క్రితం పెను ప్రమాదం తప్పింది. నిండా ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ‘ఇంద్ర’ ఏసీ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. జనం చూస్తుండగానే, క్షణాల్లో ఆ బస్సు కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగసిన మంటలు క్షణాల్లో బస్సును దహించివేశాయి. అయితే వేగంగా స్పందించిన డ్రైవర్ బస్సును నిలిపేయడమే కాక, బస్సులోని ప్రయాణికులను క్షణాల్లో కిందకు దించేశాడు. బస్సు పూర్తిగా దహనమైన ఈ ఘటనలో ఒక్క ప్రయాణికుడికీ గాయాలు కాకుండా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. ఏమాత్రం ఆలస్యం జరిగినా, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. బస్సులో నుంచి సురక్షితంగా దిగిన తర్వాత... ఈ ఘటనను తలచుకుని ప్రయాణికులు షాక్ కు గురయ్యారు.