: మెహబూబాకు షాక్!... శాఖ కేటాయింపుపై మంత్రి కినుక, బీజేపీ హైకమాండ్ కు రాజీనామా లేఖ


రోజుల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ జమ్మూ కాశ్మీర్ సీఎం పీఠం అధిష్టించిన మెహబూబా ముఫ్తీకి ఆ మరునాడే షాక్ తగిలింది. బీజేపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్న సజ్జద్ ఘనీ లోన్... తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మెహబూబాకు పంపడానికి బదులుగా ఘనీ... బీజేపీ హై కమాండ్ కు పంపారు. మొన్న తన కేబినెట్ లో మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన ఘనీకి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయిస్తూ మెహబూబా నిర్ణయం తీసుకున్నారు. అయితే వైద్య, ఆరోగ్య శాఖను ఆశించిన ఘనీ.. సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనువెంటనే తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఘనీని చల్లబరిచేందుకు అటు బీజేపీ, ఇటు పీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ మెహబూబాతో ఈ విషయంపై మాట్లాడితే కాని సర్దుబాటు జరిగేలా లేదు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఘనీ... గడచిన ఎన్నికల్లో తన పార్టీ టికెట్ పైనే కుప్వారా జిల్లాలోని హంద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి సంపూర్ణ మద్దతు పలికారు. ఈ క్రమంలో ముఫ్తీ మొహ్మద్ సయీద్ కేబినెట్ లో ఆయన బీజేపీ కోటాలో మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News