: తాత్కాలిక సన్యాసం స్వీకరించిన మయన్మార్ మాజీ అధ్యక్షుడు
మయన్మార్ మాజీ అధ్యక్షుడు థియన్ సెన్ తాత్కాలిక సన్యాసం స్వీకరించారు. అధికార బదలాయింపు జరిగిన నాలుగు రోజుల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధమతస్థులు ఎక్కువగా ఉండే మయన్మార్ లో చాలా మంది వారికి ఇష్టమైన సమయంలో కొద్ది రోజుల పాటు సన్యాసం స్వీకరించి, బౌద్ధ సన్యాసులతో గడపడం పరిపాటి. కాగా, గుండు చేయించుకుని, ఎర్రని వస్త్రాలను ధరించి ఉన్న థియన్ సెన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. థియన్ సెన్ సన్యాసంపై ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే ఆయన బౌద్ధ సన్యాసిగా ఉంటారని, దమ్మం దిప్తి ఆశ్రమంలో గడుపుతారని పేర్కొంది. అయితే, ఈ విషయమై థియన్ సెన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. గత జనవరిలో జరిగిన బౌద్ధుల సమావేశానికి థియన్ సెన్ హాజరైన సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.