: రజనీని అటువైపు లాగొద్దు: సూపర్ స్టార్ సోదరుడు
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఇన్సింగ్స్ ఆరంభంపై ఆయన అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. అయితే, రజనీ ఎప్పట్లా రాజకీయాలకు దూరంగానే వున్నారు. ఈ నేపథ్యంలో, రజనీని రాజకీయాల వైపు లాగొద్దని అంటున్నారు సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ. కృష్ణగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారన్న వాదనలపై స్పందించారు. తన సోదరుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. 66ఏళ్ల వయసులోనూ రజనీ హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నారని, రజనీ రాజకీయ ఆరంగేట్రం చేయాలనుకోవడం లేదని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ తరఫునా ప్రచార ఆర్భాటాల్లో రజనీ పాల్గొనబోరని అన్నారు. గతంలోనూ రజనీ రాజకీయ ఆరంగేట్రంపై సూపర్ స్టార్ సోదరుడు సత్యనారాయణ పలు సందర్భాల్లో ఇదే విధంగా స్పందించారు. తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులని, రజనీ రాజకీయాల్లో ఇమడలేడని అన్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు.