: అనుకున్నట్టుగానే... వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ


మార్కెట్ వర్గాలు ఊహించినట్టుగానే రెపో రేటు (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు)ను పావు శాతం తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సర పరపతి సమీక్ష ఈ ఉదయం జరుగగా, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో 6.75 శాతంగా ఉన్న రెపో రేటు 6.50 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో రివర్స్ రెపో రేటు (ఆర్బీఐ వద్ద బ్యాంకులు దాచుకునే నిధులపై పొందే వడ్డీ)ను సైతం 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచుతున్నట్టు రాజన్ వెల్లడించారు. సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో - నగదు నిల్వల నిష్పత్తి) యథాతథంగా ఉంచుతున్నామని, అయితే, ప్రస్తుతం సీఆర్ఆర్ రోజువారీ కనీస నిర్వహణ 95 శాతం కాగా, బ్యాంకులకు మరింత వెసులుబాటు కల్పించేలా దీన్ని 90 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. చిల్లర ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతంలోపు ఉండటం, వడ్డీ రేట్లను తగ్గించేందుకు సహకరించిందని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. 2016-17లో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News