: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి భారత్ పనే: పాక్ మీడియా
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి భారత్ పనేనని పాకిస్థాన్ మీడియా ఈ రోజు పేర్కొంది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ ఓ పత్రిక పేర్కొంది. పాకిస్థాన్‌పై విషప్రచారం చేసే లక్ష్యంతోనే ఒక వ్యూహం ప్రకారమే భారత్ ఈ దాడికి పాల్పడిందని రాసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా భారత్ లో పర్యటించిన పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు బృందం ఎన్ఐఏ అందజేసిన సాక్ష్యాలపై సంతృప్తి చెందలేదన్న వార్తల నేపథ్యంలో 'పాకిస్థాన్ టుడే' పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, ప్రపంచం ముందు పాక్ ను ఉగ్రవాద దేశంగా చిత్రించడం కోసమే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించారని పాక్ మీడియా పేర్కొంది. దాడి చేసిన వారు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా భారత్ నిరూపించలేకపోయిందని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం అభిప్రాయపడినట్టు పత్రిక పేర్కొంది. జనవరి 2న గుజరాత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రమూక జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణకు పాకిస్థాన్ నుంచి ఐదుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వచ్చింది. ఈ బృందం పఠాన్‌కోట్‌ను సందర్శించి, వైమానిక స్థావరంలోకి పాక్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు ఎలా వచ్చి దాడిచేశారనే అంశంపై విచారించిన విషయం తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో పాక్ బృందం తన నివేదికను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందించనుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ఇటువంటి రాతలు రాసింది.