: ఆర్కే నగర్ నుంచే ‘అమ్మ’ పోటీ!...తమిళనాట అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో దోషిగా తేలిన తనను తిరిగి గెలిపించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేయాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ఆమె నిన్న ప్రకటించారు. చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జయలలిత... రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేశారు. మొత్తం 234 సీట్లలో 227 సీట్లను అన్నా డీఎంకే అభ్యర్థులకు కేటాయించిన జయ, మిగిలిన ఏడు సీట్లకు మిత్ర పక్షాలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేశారు. మిత్రపక్షాల అభ్యర్థులు కూడా అన్నాడీఎంకే గుర్తుపైనే పోటీ చేస్తారని కూడా జయ ప్రకటించారు. అయితే, జాబితాలో పది మంది మంత్రుల పేర్లు గల్లంతయ్యాయి. 149 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లిచ్చిన జయ... మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించించారు.