: చంద్రబాబు కేబినెట్ లోకి లోకేశ్!
టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు. ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా కనిపిస్తున్న లోకేశ్... మరో రెండు, మూడు నెలల్లో మంత్రిగా కనిపించనున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ ను తన కేబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే దీనిని అమలులోకి తీసుకురానున్నారని ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది. ఇప్పటికే మిత్ర పక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో లోకేశ్ కు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే... అటు ఏపీకే కాక ఇటు తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే తనయుడు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ పై ఒత్తిడి తీసుకురావడం కుదరదన్న భావనతో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించలేదు. అదే సమయంలో పాలనానుభంతో పాటు ‘రాజ్యాంగేతర శక్తి’ అన్న విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా లోకేశ్ ను తన కేబినెట్ లోకి తీసుకుంటేనే బాగుంటుందన్న కోణంలో చంద్రబాబు యోచించారు. దీనిపై ఇప్పటికే తన కేబినెట్ సహచరులు, పార్టీ కీలక నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన చంద్రబాబు... లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకునేందుకే నిర్ణయించారు. జూన్ 8 నాటికి నవ్యాంధ్ర కేబినెట్ ప్రమాణం చేసి రెండేళ్లవుతుంది. ఆ తర్వాత అదే నెల చివరలో గాని లేదంటే జూలై ప్రథమార్ధంలో గాని తన కేబినెట్ లో స్వల్ప మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకరిద్దరు పాత వాళ్లకు ఉద్వాసన పలకడంతో పాటు అంతే సంఖ్యలో కొత్తవారికి అవకాశం కల్పించాలని ఆయన యోచిస్తున్నారు. అప్పుడే లోకేశ్ ను కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది.