: తెలంగాణ సింగిల్ విండో విధానం అత్యుత్తమమైనది: కేసీఆర్
1691 సంస్థలకు సత్వర అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ సింగిల్ విండో విధానం అత్యుత్తమమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరిగిన ఐటీ విధాన ప్రకటన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1691 సంస్థలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేశామని అన్నారు. అనుమతుల మంజూరులో అవినీతికి తావు లేదని ఆయన చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ వేగవంతమైన అభివృద్ధి సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వాతావరణం, ప్రజలు, విధానాలు, వ్యాపారానికి అనువుగా ఉంటాయని ఆయన తెలిపారు. అందువల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఐటీతో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయడం హర్షణీయమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో పారిశ్రామిక వేత్తలు చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.