: బెంబేలెత్తించే ఎండల్ని మరచేలా... వైవిధ్యంగా స్విమ్మింగ్ తో ఎంజాయ్!
వ్యాయామం ఒంటికి మంచిదే అయినా, వేసవిలో ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలో అతిగా వ్యాయామం చేయడం అంత మంచిది కాదు. జిమ్ములో ఎక్సెర్ సైజులకు బదులు స్మిమ్మింగ్ చేయడం చాలా ఉత్తమం. ఉక్కపోతతో అల్లాడిపోవడం ఎందుకని హైదరాబాదీయులు స్మిమ్మింగ్ పూల్‌లో కాసేపు సేదతీరుతున్నారు. వేసవిలో స్మిమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. స్మిమ్మింగ్‌తో ప్రతి అవయవం కదలడంతోపాటు వ్యాయామం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈతకొట్టడం వల్ల కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గేందుకు, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు, రక్తపోటు, మధుమేహం స్థాయులను అదుపులో ఉంచేందుకు ఉపకరిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో ఉత్సాహవంతులందరూ ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాదు, బంజారాహిల్స్‌లో సరదాగా.. స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్నారు మహిళలు. స్విమ్మింగ్ పూల్‌లో కేవలం స్నానం చేయడమే కాకుండా, స్లిమ్మింగ్ కోసం ప్రయత్నాలు చేయడంతో పాటుగా వెరైటీ నృత్యం చేసేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని వాటర్ లాంజ్‌లో అథెంటిక్ అరబ్బీ బీట్స్‌కు స్విమ్మింగ్‌ఫూల్‌లోనే నడుం ఊపారు. ఆక్వా జుంబా గురించి తెలిసిన వారు ఆక్వా అరబ్బీ అంటూ వినూత్నమైన డ్యాన్స్‌లతో అదరగొడుతున్నారు. ఎండల్లో హాయ్.. హాయ్‌గా ఉండే స్విమ్మింగ్ పూల్ వైపు నడుస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈత కొలనులు అందుబాటులో ఉంటాయి. మహిళలకు ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ఈత కొలనులు అందుబాటులో ఉంటాయి. స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడం వల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే, స్మిమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరిచిపోవద్దు.