: విండీస్ సంబరాల స్టైలే వేరు!... మైదానంలోనే చొక్కాలు విప్పిన కరేబియన్లు!
ఓడితే... నిర్వేదం ఆపుకోలేని తీరు. గెలిస్తే... వినూత్న సంబరాలతో హోరెత్తించే వైనం. ఇదీ కరేబియన్ జట్టుగా మనం పిలుచుకుంటున్న వెస్టిండీస్ జట్టు స్టైల్. మొన్న సెమీ ఫైనల్ లో ధోనీ సేనపై విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూంలోకి చేరేదాకా ఓపిక పట్టిన కరేబియన్ క్రికెటర్లు... నిన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్టేడియంలోనే సంబరాల జోరును ప్రారంభించారు. మొన్నటి సెమీస్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఆ జట్టు సభ్యులు క్రిస్ గేల్, డ్వెయినీ బ్రేవోలు చొక్కాలు విప్పి వినూత్న డ్యాన్స్ తో హోరెత్తించారు. తాజాగా నిన్న ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనే చొక్కాలు విప్పిన విండీస్ క్రికెటర్లు తమ జాతీయ జెండాను చేతబట్టుకుని స్టేడియం చుట్టూ ఓ రౌండేశారు. జట్టు కెప్టెన్ డారెన్ సామీ, కీలక ఆటగాడు అండ్రూ రస్సెల్ లు షర్ట్ లు తీసేసి, జాతీయ జెండాను పట్టుకుని ముందు నడవగా, వారి వెంటే మిగిలిన జట్టు సభ్యులు అడుగేశారు.