: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మాస్టర్ బ్లాస్టర్ సరికొత్త సలహాలు!


క్రికెట్ లో దేవుడిగా అభిమానుల చేత పిలిపించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్... దేశంలోనే ‘భారత రత్న’ అవార్డును అందుకున్న తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్, చట్టసభ సభ్యుడిగానూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్, ఆ గ్రామాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా దేశ వాణిజ్య రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు. అయితే నేరుగా కంపెనీలను పెట్టకుండా, అప్పటికే సత్తా చాటుతున్న చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ‘స్మాట్రాన్’ కంపెనీలో మైనారిటీ వాటాదారుడిగా మారిన ఆయన నిన్న ఓ తెలుగు దినపత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. జీవిత భాగస్వామి సహకారం ఎంత ముఖ్యమో... వ్యాపారంలో వ్యాపార భాగస్వామి ఎంపిక కూడా అంతే ముఖ్యమని సూచించారు. మంచి సలహా బృందాన్ని ఎంచుకోవడం కూడా అంతే కీలకమన్నారు. ఇక బిజినెస్ లోని ఆటుపోట్లను ప్రస్తావించిన ఆయన ముందు జాగ్రత్త వహించకుంటే ఇబ్బందులకు గురి కాక తప్పదని హెచ్చరించారు. ఆటలో షార్ట్ పిచ్ బంతులకు టెంప్ట్ అయితే అవుటవుతామని, అలాగే బిజినెస్ లో అనవసర విషయాలకు టెంప్ట్ అయితే మునిగిపోతామని చెప్పారు. వ్యాపారంలో రాణించాలంటే సాంకేతికతపై పట్టు సాధించాలని సూచించారు. సరైన ప్రణాళికతో ముందుకెళితే... బిజినెస్ లో సిక్సర్ కొట్టడం ఖాయమేనని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News