: చిన్నప్పుడు నా కుడి కన్ను కనిపించేది కాదు.. తర్వాత ఎవరో దానం చేసిన కంటిని అమర్చారు!: సినీ నటుడు రానా


మరణించే ముందు తాత రామానాయుడు తనతో మాట్లాడుతూ కష్టాన్ని భరించగలిగే వారికే దేవుడు సమస్యలు ఇస్తాడని అన్నారని సినీ నటుడు రానా చెప్పాడు. మంచు లక్ష్మి నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో రానా మాట్లాడుతూ, సమస్యలు ధైర్యవంతులకే వస్తాయని తెలిపాడు. ఈ కార్యక్రమంలో భాగంగా హమాలీ పని చేస్తూ మృత్యుఒడి చేరిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేశాడు. బాధిత కుటుంబంలో మృతుడి భార్యకు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చూపులేదు. ఆమె తల్లిదండ్రులు వయసు పైబడడంతో వారిని 'మేము సైతం' టీమ్ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా రానా కూలీగా మూటలు మోశాడు. ఇలా సమకూరిన డబ్బును బాధితులకు ఇచ్చాడు. బాధితురాలికి చూపులేదని తెలిసిన రానా తనకు కూడా ఒక కన్ను కనిపించేది కాదని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశాడు. తనకు చిన్నప్పుడు కుడి కన్ను కనిపించేది కాదని, అయితే ఎవరో ఒక వ్యక్తి మరణించిన తరువాత దానం చేసిన కంటిని తనకు అమర్చారని, అప్పటి నుంచి తాను ప్రపంచాన్ని పూర్తిగా చూడగలుగుతున్నానని రానా తెలిపాడు. అప్పుడప్పుడు ఒక కన్ను మూసి ప్రపంచాన్ని చూసేందుకు ప్రయత్నిస్తానని రానా చెప్పాడు. దేవుడు భరించగలిగిన వారకే కష్టాలిస్తాడని, ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని రానా స్పూర్తి నింపాడు.

  • Loading...

More Telugu News