: భయపడ్డాను...అందుకే పోలీసులకి చెప్పలేదు: ప్రత్యూష ప్రియుడు
'బాలికావధు', 'బిగ్ బాస్ సీజన్7' ద్వారా ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. తామిద్దరం డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో ఉండేవారమని, ఈ ఫ్లాట్ కు సంబంధించిన రెండు తాళాలు, ఒకటి ఆమె దగ్గర, మరొకటి తనదగ్గర ఉండేవని చెప్పాడు. నిన్న ఉదయం పది గంటలకు తాను బయటకు వెళ్లానని, అప్పుడు ప్రత్యూష బాగానే ఉందని పోలీసులకు తెలిపాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి చూస్తే ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని అన్నాడు. దీంతో ఆందోళనతో చుట్టుపక్కల వారిని పిలిచి ఆమె బతికే ఉందని భావించి ఆసుపత్రికి తరలించానని, అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారని వారికి వివరించాడు. దీంతో తాను భయపడ్డానని, ఆసుపత్రి అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పాడు. తాను ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించానని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.