: పెళ్లి కాకుండానే చిన్నారి పెళ్లికూతురి నుదట సింధూరం!... వైరల్ గా మారిన వీడియో
బుల్లి తెరపై చిన్నారి పెళ్లికూతురుగా ఆకట్టుకున్న ప్రత్యూష బెనర్జీ నిజజీవితంలో పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకున్న తర్వాతే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అంటే అవుననే అంటోంది ఓ వీడియో. నేషనల్ మీడియాలో నేటి ఉదయం ప్రత్యక్షమైన సదరు వీడియా ప్రస్తుతం వైరల్ గా మారింది. కొంతకాలంగా నిర్మాత, నటుడు రాహుల్ రాజ్ సింగ్ తో ప్రేమాయణం సాగిస్తున్న ప్రత్యూష నిన్న ముంబైలోని తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయిన స్థితిలో కనిపించింది. ప్రత్యూషను విగత జీవిగా అందరికంటే ముందు చూసిన ఆమె స్నేహితురాలు డాలీ బింద్రా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. చనిపోయినప్పుడు ప్రత్యూష నుదట సింధూరం ఉందని ఆమె పేర్కొంది. ఇక నేటి ఉదయం నేషనల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలోనూ ఓ పార్టీలో రాహుల్ తో కలిసి కనిపించిన ప్రత్యూష నుదట సింధూరం స్పష్టంగా కనిపించింది. అంటే, చనిపోవడానికి ముందే ఆమె రాహుల్ ను వివాహం చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యూష పెళ్లిపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నుదుట సింధూరంతో ప్రత్యూష కనిపిస్తున్న సదరు వీడియో వైరల్ అయిపోయింది.