: ఇతడిని చూసిన తర్వాతైనా... విశ్వాసం కోల్పోవద్దు!: ఓటమిపై కోహ్లీ ట్వీట్స్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ భారత్ దే. మెగా టోర్నీ మొదలు కాకముందు నుంచి క్రికెట్ పండితులదంతా ఇదే మాట. చిచ్చర పిడుగు లాంటి విరాట్ కోహ్లీ, ఒత్తిడిని ఇట్టే జయించే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రీడాకారులున్న టీమిండియాకు ఆ అర్హత ఉందన్నది వారి భావన. వారి అంచనాలను సగం మేర నిజం చేస్తూ టీమిండియా సెమీస్ చేరింది. అయితే సెమీస్ లో స్వయంకృతాపరాధంతో టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. మొన్న రాత్రి వాంఖడే వేదికగా వీరవిహారం చేసిన విరాట్ కోహ్లీ... కేవలం 47 బంతుల్లోనే 83 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ ను కూడా నేలకూల్చాడు. బౌలర్లు చేసిన చిన్న తప్పిదాలు కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ను వృథా చేశాయి. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కోహ్లీ... అంతే వేగంగా సదరు నిర్వేదం నుంచి బయటపడ్డాడు. పరాజయం నుంచి కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే అతడు తేరుకున్నాడు. జట్టు విజయాన్ని ఏమాత్రం ప్రస్తావించని కోహ్లీ... కాశ్మీర్ కు చెందిన ఆమీర్ హుస్సేన్ లోన్ కు సంబంధించిన వీడియోను కోట్ చేస్తూ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఎప్పటికీ విశ్వాసం కోల్పోవద్దు. జీవితానికి ముగింపు లేదు. ప్రారంభం మాత్రమే ఉంది. ఈ యువకుడికి జోహార్లు’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కు రెండు చేతులు లేని ఆమిర్ క్రికెట్ ఆడుతున్న వీడియోను జత చేశాడు. ఎనిమిదేళ్ల ప్రాయంలో జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఆమిర్... ఆ తర్వాత తనకిష్టమైన క్రికెట్ కు దూరం కాలేదని కోహ్లీ చెప్పాడు. రెండు చేతులు లేని ఆమిర్... కాలి వేళ్లతో బౌలింగ్ చేయడం... మెడ, భుజం మధ్యలో బ్యాటును పట్టుకుని బ్యాటింగ్ చేయడం, సొంత పనులను స్వయంగా చేసుకుంటున్న ఆమిర్ ను చూసైనా విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కోహ్లీ పరోక్షంగా సూచించాడు.