: గుజరాత్ లో పెన్నులపై కమలం, మోదీ చిత్రాలు... 'రాజకీయం' అంటున్న ప్రతిపక్షాలు!
పెన్నులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తుతో పాటు ‘ఐ లవ్ మోదీ’ అని రాసి ఉన్న వాటిని గుజరాత్ లో విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఆ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ప్రారంభం కావడానికంటే ముందుగానే ఒక ప్రైవేటు సంస్థ ఈ పెన్నులను విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లోని ఒక పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ మాట్లాడుతూ, కాషాయం రంగులో ప్యాక్ చేసి ఉన్న సుమారు 5 నుంచి 10 పెన్నుల ప్యాకెట్లు తమకు అందాయన్నారు. ఒక్కొక్క ప్యాకెట్ లో ఐదు పెన్నులున్నాయని, ఈ ప్యాకెట్లతో పాటు ఒక కవరింగ్ లెటర్ కూడా ఉందని చెప్పారు. ఈ పెన్నులను విద్యార్థులకు గిఫ్ట్ గా ఇవ్వాలని, ఇందుకుగాను, గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ ఆర్ జే షా, డిప్యూటీ చైర్మన్ ఆర్ఆర్ థాకర్ ల అనుమతి తీసుకున్నామని ఆ కవరింగ్ లెటర్ లో ఉంది. ఈ సంఘటనపై రాజకీయపార్టీలు మండిపడుతున్నాయి. విద్యార్థుల పరీక్షలను కూడా రాజకీయం చేస్తారంటూ విమర్శిస్తున్నారు. కాగా, ఈ పెన్నులు పంపిణీ చేసిన కంపెనీ ‘టుడేస్ పెన్స్’ ప్రొమోషనల్ హెడ్ సురేష్ జవేరి మాట్లాడుతూ, ‘ఐ లవ్ మోదీ’ అని రాసి ఉన్న 1.50 లక్షల పెన్నులను అహ్మదాబాద్, గాంధీనగర్, వాద్ నగర్ లోని విద్యార్థులకు తమ కంపెనీ పంచిపెట్టిందన్నారు. మూడేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని తాము చేపట్టామన్నారు. పెన్ను కవర్లపై, పెన్నులపై ఉన్న మోదీ, కమలం గుర్తుల గురించి ప్రస్తావించగా..‘ఆ పెన్నులు రాసుకుని వదిలేసేవేగా?’ అనే సమాధానం కంపెనీ ప్రతినిధుల నుంచి వస్తోంది.