: భారీ ప్రాణ నష్టానికి ఐవీఆర్సీఎల్ మత్రమే కారణమా?... దీదీ సర్కారు పాత్ర కూడా ఉందంటున్న బెంగాలీలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిన్న ఓ ఫ్లై ఓవర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 25 మంది మృతదేహాలు బయటపడ్డాయి. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా పక్కకు జరగని శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి ఘోర ప్రమాదానికి... ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం మాత్రమే కారణమా? అంటే, ఐవీఆర్సీఎల్ తో పాటు మమతా బెనర్జీ సర్కారు ఉదాసీన వైఖరి కూడా కారణమేంటున్నారు బెంగాలీలు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు గంటలకు గాని పోలీసులు అక్కడికి చేరుకోలేకపోయారు. సమాచారం తెలిసి పరుగు పరుగున పోలీసులు వచ్చినా, శిథిలాలను తొలగించడం వారికి సాధ్యం కాలేదు. గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్లు లేకుండా ఎవరైనా ఏమీ చేయలేని పరిస్థితి. ఫ్లై ఓవర్ నిర్మాణంలో వినియోగించిన భారీ కాంక్రీట్ దిమ్మెలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అయినా... జనాభాలో టాప్ 5 లోని నగరాల్లో ఒకటిగా ఉన్న కోల్ కతాలో ఆ మాత్రం సహాయక సరంజామా లేకుంటే ఎలా? నగరం నడిబొడ్డున ప్రమాదం జరిగితే... అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు అంత సమయం ఎందుకు పట్టింది? కాస్తంత ఆలస్యంగా వచ్చినా, సహాయక చర్యలు వెనువెంటనే ఎందుకు ప్రారంభం కాలేదు? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేదాకా సహాయక చర్యలు ఎందుకు ఊపందుకోలేదు? మరో ప్రైవేట్ కంపెనీ స్పందించేదాకా అక్కడికి గ్యాస్ కట్టర్లు ఎందుకు రాలేదు? అసలు ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల సందర్భంగా సహాయక చర్యల్లో నమోదైన వేగం.. ఇక్కడెందుకు లేదు?.... ఇవన్నీ ఐవీఆర్సీఎల్ కంపెనీ సంధిస్తున్న ప్రశ్నలు ఎంతమాత్రం కాదు. పశ్చిమ బెంగాల్ సర్కారుపై అక్కడి బెంగాలీలు సంధిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రమాదానికి ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణమైతే... పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి మాత్రం సహాయక చర్యల్లో నెలకొన్న జాప్యమేనని బెంగాలీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ ఆసక్తికర కథనం రాసింది.