: హైదరాబాదులో కోల్ కతా పోలీసులు... ఐవీఆర్సీఎల్ అధికారుల అరెస్ట్ కు రంగం సిద్ధం


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఐవీఆర్సీఎల్ ను చిక్కుల్లో పడేసింది. నిన్న మధ్యాహ్నం ఉన్నట్టుండి పేకమేడలా కుప్పకూలిన ఫ్లై ఓవర్ కింద చిక్కుకుని ఇప్పటిదాకా 25 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఐవీఆర్సీఎల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న వాదనతో దీదీ సర్కారు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కోల్ కతాలోని ఐవీఆర్సీఎల్ కార్యాలయాలను సీజ్ చేసిన బెంగాల్ పోలీసులు అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదానికి ప్రధాన బాధ్యురాలిగా ఐవీఆర్సీఎల్ పై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆ సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయమే హైదరాబాదులో ల్యాండైన బెంగాల్ పోలీసులు ప్రస్తుతం ఇక్కడి ఐవీఆర్సీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. ఏ క్షణంలోనైనా సంస్థ ఉన్నతాధికారులతో పాటు యాజమాన్యానికి చెందిన ప్రతినిధులను కూడా బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News