: 25కు చేరిన కోల్ కతా ఫ్లై ఓవర్ మృతులు... ఐవీఆర్సీఎల్ పై కఠిన చర్యలకు దీదీ ఆదేశం


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న రాత్రికే 21 మంది మృతదేహాలను వెలికితీసిన సహాయక సిబ్బంది... తాజాగా నేటి ఉదయం మరో నలుగురి డెడ్ బాడీలను గుర్తించింది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేస్తున్న హైదరాబాదుకు చెందిన ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని బెంగాల్ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో సదరు కంపెనీపై మమతా బెనర్జీ సర్కారు కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కోల్ కతాలోని కంపెనీకి చెందిన మూడు కార్యాలయాలను సీజ్ చేశారు. కార్యాలయాల్లో ముమ్మరంగా సోదాలు చేసిన తర్వాత పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక నిన్న రాత్రే ఫిర్యాదు అందుకున్న పోలీసులు నేటి ఉదయం కేసు నమోదు చేశారు. పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 25 మంది నిండు ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదాన్ని ‘దైవ ఘటన’గా పేర్కొన్న కంపెనీ ప్రకటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కంపెనీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ... ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News