: గేల్ చెలరేగితే చూడడం తప్ప ఏమీ చెయ్యలేం...నెహ్రా ఎంపిక బెస్ట్: కపిల్ దేవ్
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ చెలరేగి ఆడితే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేమని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ చెప్పారు. ముంబయ్, వాంఖడేలో రెండో సెమీ పైనల్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గేల్ ను కుదరుకోనియ్యకుండా చేయగలిగితే టీమిండియా సగం విజయం సాధించినట్టేనని అన్నారు. తొలి ఆరు ఓవర్లలో గేల్ ను స్వేచ్ఛగా ఆడకుండా చేయగలిగితే అతని వికెట్ లభించినట్టేనని ఆయన పేర్కొన్నారు. వెటరన్ ఆశిష్ నెహ్రాను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్లు తీసుకున్న గొప్ప నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. అనుభవరాహిత్యం కనపడకుండా నెహ్రా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. పరుగులివ్వకుండా నియంత్రిస్తూ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని నెహ్రాకు ఆయన కితాబిచ్చారు. విండీస్ ఆటగాళ్లకు కోహ్లీ కొరకరాని కొయ్య అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిడిలో రాణించడం కోహ్లీ బలమని, పెద్దజట్లతో మ్యాచ్ అంటే మరింత చెలరేగి ఆడుతాడని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ తో అంత టఫ్ మ్యాచ్ ను ఆడకపోయి ఉంటే భారత్ ఇలాంటి ప్రదర్శన చేసి ఉండేదికాదని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తో విజయం జట్టులో స్పూర్తి పెంచిందని ఆయన చెప్పారు.