: ఓటు వేస్తే పోలింగ్ రోజునే లక్కీ డ్రా ద్వారా బహుమతి... ఓటుహక్కు వినియోగంపై కేరళ కలెక్టర్ వినూత్న కార్యక్రమం
ఎన్నికల్లో తమకు ఓట్లడుగుతూ అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు కూడా పలువురు అధికారులు వినూత్న మార్గాల్ని ఎంచుకుంటున్నారు. ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ.. కేరళలోని పత్తనంతిట్ట అధికారులు లక్కీ డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తనంతిట్ట కలెక్టర్ హరికిశోర్ ప్రత్యేకంగా ఓటుహక్కు వినియోగంపై లక్కీ డ్రా ద్వారా ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ‘వోట్ అండ్ విన్’ కాంటెస్ట్ పెడుతున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసిన వారికి సీరియల్ నంబరుతో కూడిన కూపన్ ఇస్తారు. వీటికి లక్కీ డ్రా తీస్తారు. ఇందులో గెలుపొందిన వారికి పోలింగ్ రోజునే రూ.1000 విలువ చేసే బహుమతి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. మరోవైపు తమిళనాడులో కూడా వినూత్న రీతిలో ఓటు హక్కుపై ప్రచారం చేస్తున్నారు. త్వరలో తమిళనాడులో జరగబోయే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రచారం ప్రారంభించింది. బిగ్ బజార్ లాంటి మెగామాల్స్‌లో క్యారీ బ్యాగుల మీద, పలు టెక్స్‌టైల్ దుకాణాలు, గొలుసు రెస్టారెంట్ల క్యారీ బ్యాగుల మీదా ఎన్నికల తేదీల్ని పెద్ద సైజులో కనిపించేట్టు స్టిక్కర్లు వేయించింది. ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ.. ఎన్నికల తేదీని పేర్కొంటూ ప్రింట్ చేయించిన క్యారీ బ్యాగులతో ఈసీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది.