: కిడ్నాప్ కాదు... తలసాని కొడుకు బెదిరించారు!: ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు
నిన్న రాత్రి హైదరాబాదులో కలకలం రేపిన కిడ్నాప్ ఘటనకు సంబంధించి బాధితుడు, విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొన్న ఆయన కేవలం బెదిరింపులు ఎదురయ్యాయని చెప్పారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తన భూమిని ఆర్ ఆర్ కన్ స్ట్రక్షన్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చానన్న ఆయన... సదరు సంస్థ బిల్డర్ రామకృష్ణ తనను బెదిరించారని ఆరోపించారు. నిన్న సాయంత్రం రామకృష్ణ తనను నగరంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లగా, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి బెదిరించారన్నారు. ఈ క్రమంలో తమ భూమికి చెందిన పత్రాలను లాక్కోవడమే కాక కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని వదిలేశారని చెప్పారు. జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్టు కాలనీ సమీపంలో తనను కారులో ఎక్కించుకున్న రామకృష్ణ ఆ తర్వాత అర్ధరాత్రి కొండాపూర్ పరిధిలో వదిలేశారని తెలిపారు. అయితే తాను కిడ్నాప్ నకు గురయ్యానంటూ తన భార్య కొత్తపల్లి గీతకు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని ఆయన పేర్కొన్నారు. జరిగిన విషయాన్నంతా పంజాగుట్ట పోలీసులకు చెప్పడంతో పాటు తనను బెదిరింపులకు గురి చేసిన తలసాని కొడుకు సాయిపైనా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.