: పాకిస్థాన్ చాలా.. చాలా కీలక సమస్య: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి రేసులో తీవ్ర పోటీనిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. అణ్వాయుధాలుగల పాకిస్థాన్ చాలా.. చాలా కీలక సమస్యగా మారిందని అన్నారు. పరిస్థితులను ఆ దేశం అదుపులో పెట్టవలసి ఉందన్నారు. ఆ దేశంలో అణ్వాయుధాలు ఉన్నాయని, అందువల్ల అమెరికాకు కూడా ఆ దేశం కీలకమైనదేనని ట్రంప్ అన్నారు. ఈస్టర్ పర్వదినంనాడు లాహోర్‌లోని పార్క్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 74 మంది మృతి చెందిన దుర్ఘటన తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఈ దుర్ఘటనలో అత్యధికంగా క్రైస్తవులు మరణించారన్నారు. ఈ విషయమై డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులను తన ట్వీట్‌లో ఆయన ఖండించలేదు. కానీ ఆ సమస్యను ఒంటరిగానే పరిష్కరించనున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకర దేశమంటూ, ఆ దేశం నుంచి అణ్వాయుధాలను తొలగించాలని ట్రంప్ పాకిస్థాన్‌పై పలుసార్లు మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే, తాజాగా విస్కన్సిన్‌లో వచ్చే నెల 5న రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ జరుగనున్న సందర్భంగా ట్రంప్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌పై మరోసారి ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.