: దుప్పటి కప్పుకునే పడుకుంటుంది... పెంపుడు సింహం ముచ్చట!
అడవుల్లో ఉండాల్సిన సింహపు పిల్లను అక్రమంగా తీసుకొచ్చి పెంచుకుంది అమెరికాలోని ఒక కుటుంబం. దీనికి ల్యాంబర్ట్ అని పేరు పెట్టారు. అయితే, అది పెరిగి పెద్దదైతే వచ్చే సమస్యలను ముందుగానే ఊహించి దానిని వదిలించుకోదలిచారు. దానికి ఆహారం పెట్టకుండా మాడ్చారు. ఆ తర్వాత బయటకు వదిలేశారు. వెటర్నరీ టెక్నీషియన్, ఇన్ సింక్ ఎగ్జోటిక్స్ అనే వన్యప్రాణుల సంరక్షణ, ఎడ్యుకేషనల్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విక్కీ కీహే, ల్యాంబర్ట్ ను చూడటం జరిగింది. దానిని వన్యప్రాణుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత ల్యాంబర్ట్ గురించిన కొత్త విషయం ఒకటి తెలిసింది. ల్యాంబర్ట్ చిన్నప్పటి నుంచి పరుపుపై పడుకోవడంతో పాటు దుప్పటి కప్పుకునే అలవాటు కూడా ఉందన్న విషయం దాని యజమానుల ద్వారా తెలిసింది. దీంతో, ల్యాంబర్ట్ కోసం ఒక దుప్పటి తెచ్చి దాని బోన్ లో పడేసేవారు. ఆ దుప్పటిని చూసిన ఆనందంతో ల్యాంబర్ట్ దాన్ని చుట్టేసుకుని పడుకునేదని విక్కీ తెలిపారు. రెండేళ్ల సింహపు పిల్ల ల్యాంబర్ట్ పెంపుడు జంతువుగా పెరిగింది కనుక, అడవుల్లో ఉండలేదని, అందుకే దానిని వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి తీసుకువచ్చామని చెప్పారు.