: విమానం హైజాక్ కథ సుఖాంతం... హైజాకర్ అరెస్టు
ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం సమాహాను సైప్రస్ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. నేటి ఉదయం అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని నడుముకు బెల్టు బాంబు కట్టుకున్న ఇబ్రహీం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 81 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్న విమానం హైజాక్ అయ్యిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. సైప్రస్ లో విమానం ల్యాండవగానే, తన డిమాండ్ నెరవేరేదాకా ప్రయాణికులను వదిలేది లేదని చెప్పిన ఇబ్రహీం సమాహా, ఆ తర్వాత ఐదుగురు విదేశీ ప్రయాణికులు, విమాన సిబ్బందిని బందీలుగా పెట్టుకుని మిగిలిన వారందరినీ వదిలి పెట్టేశాడు. తన భార్యను తీసుకువచ్చి అప్పజెప్పి, సైప్రస్ లో తనకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశాడు. ఆ తరువాత అధికారులు జరిపిన సంప్రదింపులతో బందీలను విడుదల చేశాడు. అనంతరం చాకచక్యంగా విమానంలోకి ప్రవేశించిన భద్రతాధికారులు సమాహాను అదుపులోకి తీసుకున్నారు.