: మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేకపోతున్నా!... స్వదస్తూరితో రాజీనామా లేఖ రాసిన జ్యోతుల
వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూ తనదైన శైలిని చూపారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఎదిగిన జ్యోతుల నెహ్రూ... వైసీపీకి రాజీనామా విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా రాజీనామా లేఖను డీటీపీ చేయించడానికి భిన్నంగా స్వదస్తూరితో జ్యోతుల రాజీనామా లేఖ రాశారు. అందులోనూ పార్టీ వీడుతున్న కారణాన్ని కూడా ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. ఆ లేఖలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించిన జ్యోతుల 'మీ మనసుకు నచ్చినట్లుగా నడుచుకోలేకపోతున్నాను' అని పేర్కొన్నారు. అంతేకాక పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు జ్యోతుల ప్రకటించారు.