: అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి... ఇకపై ఏపీలో 225, తెలంగాణలో 153: వెంకయ్య


తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచే ప్రక్రియ సాగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 175వ అధికరణం సూచించిన విధంగా అసెంబ్లీల సంఖ్యను పెంచేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయని కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాకు తెలిపారు. ఏపీలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు, తెలంగాణలో 153కు పెంచే యోచనలో ఉన్నట్టు వివరించారు. ఇందుకోసం చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. అసెంబ్లీల పెంపుదల తరువాత న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకు హోం శాఖతో పాటు ఆర్థిక, రెవెన్యూ, న్యాయ శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. అసెంబ్లీలు పెరగాలంటే చర్చల అనంతరం హోం శాఖ నుంచి ప్రతిపాదనలు వెలువడాల్సి వుందని, ఆపై న్యాయశాఖ దాన్ని పరిశీలించి అటార్నీ జనరల్ కు పంపుతుందని, ఆయన సిఫార్సు మేరకు న్యాయ శాఖ మద్దతు తెలుపుతూ హోం శాఖకు పంపాల్సివుందని వివరించారు. ఆపై ఏపీ విభజన చట్టంలో మార్పు ప్రతిపాదించి, దానికి ఉభయ సభల్లో ఆమోదం తరువాత అసెంబ్లీల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. మరో ఒకటి, రెండు రోజుల్లో హోం శాఖ నుంచి న్యాయశాఖకు అభిప్రాయాన్ని కోరుతూ రాతపూర్వక లేఖ వెళ్లే అవకాశాలున్నాయని వెంకయ్య వివరించారు.

  • Loading...

More Telugu News