: ఉగ్రదాడి ఘటనాస్థలికి బయలుదేరిన పాక్ బృందం.. కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనాస్థలికి పాకిస్థాన్ విచారణ బృందం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ విషయమై నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎన్ఐఏ) అధికారులతో నిన్న పాకిస్థాన్ బృందం చర్చించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 2న జరిగిన పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడి ఉదంతంపై ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ బృందం దర్యాప్తు జరపనుంది. ఉగ్రదాడి ఘటనాస్థలి సహా ఇతర ప్రాంతాలను పరిశీలించనుంది. అయితే, పఠాన్‌కోట్ ఘటనపై విచారణ చేపట్టేందుకు పాక్ బృందానికి అనుమతినివ్వడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. పాక్బృందం పర్యటనను నిరసిస్తూ పఠాన్‌కోట్ వైమానిక స్థావరం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. కాగా, ఆమధ్య ఆరుగురు ఉగ్రవాదులు మూడు రోజులపాటు పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా దాడిచేసిన విషయం తెలిసిందే.