: మీ చెల్లి, భార్య, ప్రియురాలి గురించి ఆలోచించారా?: కోహ్లీ మరింత ఘాటు స్పందన
తన మాజీ ప్రియురాలు అనుష్కా శర్మ గురించి వ్యాఖ్యానిస్తున్న అభిమానులపై నిన్న రెండు వాక్యాలతో విరుచుకుపడ్డ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆపై మరింత ఘాటుగా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెడుతూ, 'మీ చెల్లెలు, భార్య లేదా ప్రియురాలి వెంట ఎవరైనా పడుతుంటే మీరేం చేస్తారు? వారి గురించి ఆలోచించారా?' అని ప్రశ్నించాడు. "ఎంతో కాలంగా అనుష్క వెంట పడుతున్న వారంతా సిగ్గు పడాలి. నాకు జరిగిన ప్రతి నెగటివ్ విషయానికీ ఆమెతో ముడిపెట్టారు. వీరంతా తాము విద్యాధికులమనుకొంటున్నారు. సిగ్గు చేటు. ఇతరులపై నిందలు మోపి ఆనందించేవాళ్లు... నా ఆటకు, ఆమెకు సంబంధం లేదని తెలుసుకోవాలి. వాస్తవానికి ఆమె నాకు ఎంతో శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చింది. దీన్ని మరిచి సామాజిక మాధ్యమాల్లో దాక్కుని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు సిగ్గు పడాలి. ఈ తరహా వ్యాఖ్యలకు నేను గౌరవం ఇవ్వను. మీ చెల్లెలు, ప్రియురాలు లేదా భార్య వెంట ఎవరైనా ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వెంట పడుతుంటే మీరేం చేస్తారు?" అని నిప్పులు చెరిగాడు.