: భారత్-ఆసీస్ మ్యాచ్ చూస్తుండగా కుక్క మొరిగిందని దాని యజమానిని చంపేశారు!
టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను చూస్తుండగా, అదే పనిగా కుక్క మొరుగుతుండటంతో కోపం వచ్చిన ఒక వ్యక్తి ఆ శునకం యజమానిని చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో నిన్న రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జేసీ నగర్ నివాసి అవినాష్(21) ఓ ప్రైవేటు కాలేజీలో బి.కామ్ చదువుతున్నాడు. భారత్-ఆసీస్ మ్యాచ్ ను ఓపెన్ ఏరియాలో బిగ్ స్క్రీన్ పై కెనడీ, అతని మిత్రులు చూస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ పెంపుడు కుక్క మొరగడం ప్రారంభించింది. అది మొరుగుతుంటే తమకు ఇబ్బందిగా ఉందని, దానిని తీసుకెళ్లి ఇంట్లో కట్టేయమని అవినాష్ తో కెనడీ చెప్పాడు. కావాలంటే, వాల్యూమ్ పెంచుకుని మ్యాచ్ చూడమని, తమ కుక్కను ఇంట్లో కట్టేసే ప్రసక్తే లేదని అవినాష్, అతని మిత్రులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో కెనడీ, అవినాష్ వర్గాల మధ్య మాటామాటా పెరిగి..ఘర్షణకు దారితీయడంతో, మద్యం సేవించి ఉన్న కెనడీ బీర్ బాటిల్ పగులగొట్టి దాంతో అవినాష్ ను పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించేటప్పటికే అవినాష్ మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.