: విరాట్ కోహ్లి కథతో చిత్రం నిర్మిస్తే ఈ ఐదుగురు హీరోల్లో ఎవరైతే బాగుంటారో!
టీ20 వరల్డ్ కప్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించి సెమీస్ లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, టీమిండియా సెమీస్ కు చేరడం వెనుక క్రికెటర్ కోహ్లి బ్యాటింగే కారణం. అదేవిధంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్ర మరవలేనిది. ధోనీకి ఉన్న అభిమానుల ఫాలోయింగ్, ఆయనకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీపై ఒక చిత్రం కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుట్ పోషిస్తున్నాడు. ఇక, కోహ్లిపైనే చిత్రం తీయాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి సినిమా వర్గాల్లో ఇప్పటి వరకైతే ఎటువంటి చర్చలు లేవు. అయితే, కోహ్లిపై సినిమా తీయడానికి ఆసక్తికరమైన కారణాలు చాలానే ఉన్నాయని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. ఒకవేళ కోహ్లిపై చిత్రాన్ని రూపొందిస్తే కనుక ఆ పాత్రను ఎవరు పోషిస్తారు, సరైన హీరోలెవరు? వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. అందుకు ఐదుగురు హీరోల పేర్లను ఆ కథనంలో ప్రస్తావించింది. ఆ ఐదుగురు హీరోల్లో ఎవరైతే కరెక్టుగా సరిపోతారంటూ ప్రశ్నించింది. ఆ హీరోలలో మన తెలుగు హీరోలు కూడా ఇద్దరు ఉన్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు,‘ధోనీ’ చిత్రంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్నారు.