: హెచ్సీయూలో విద్యార్థినులపై అత్యాచార బెదరింపులు: స్వతంత్ర నిజనిర్ధారణ కమిటీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇటీవల జరిగిన ఘటనలపై విచారించే నిమిత్తం మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలతో ఏర్పాటైన స్వతంత్ర కమిటీ సంచలన నివేదికను ఇచ్చింది. వర్శిటీలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా విరుచుకుపడ్డ పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని ఆరోపించింది. యువతులను ఇష్టానుసారం కొట్టారని, మాటలతో చెప్పలేని విధంగా దూషించారని, వారిని పలుమార్లు ఉగ్రవాదులంటూ ఈడ్చుకెళ్లారని, తమ మాట వినకుంటే అత్యాచారం తప్పదని హెచ్చరించారని తమకు ఫిర్యాదులు అందినట్టు కమిటీ నివేదిక ఇచ్చింది. అరెస్టయిన విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులను 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరు పరచలేదని, పోలీసులు హౌస్ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారని ఆరోపించింది. ఇదే నివేదికను కమిటీ హోంమంత్రికి సైతం అందించింది. పోలీసులపై తక్షణం ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని విధుల నుంచి తప్పించి, విచారణ జరిపించాలని కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఈ కమిటీలో హెన్రీ తిఫాగ్నే, తాతారావు, బుర్నార్డ్ ఫాతిమా, కుఫిర్ నల్గందవర్, కురుబా మునుస్వామి, బీనా పల్లికల్, రమేష్ నాథన్, ఆశా కౌత్వాల్, పాల్ దివాకర్ తదితరులు ఉన్నారు.