: పొరపాటు జరిగింది క్షమించండి: ఫేస్‌బుక్
విపత్తు సమయాల్లో తమ బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారాన్ని అందించే ఫేస్‌బుక్ ‘సేఫ్టీచెక్’ ఆప్షన్ నోటిఫికేషన్లలో తప్పులు దొర్లడంతో ఆ సంస్థ క్షమాపణలు తెలిపింది. ఆదివారం లాహోర్ దాడుల నేపథ్యంలోనూ పలువురు వినియోగదారులకు యోగక్షేమాలడుగుతూ ఫేస్‌బుక్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. అయితే సంఘటన జరిగింది లాహోర్‌లో కాగా.. న్యూయార్క్, వర్జీనియాల్లో ఉన్న వారికి ఈ నోటిఫికేషన్స్ రావడం వివాదాస్పదమైంది. దీంతో జరిగిన పొరపాటుకు ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది. ఫేస్‌బుక్ ‘సేఫ్టీచెక్’ ఆప్షన్.. ప్రకృతి విపత్తు, బాంబుపేలుళ్లు, వరదలు లాంటి ఘటనలప్పుడు వెనువెంటనే సమాచారాన్ని అందజేసేందుకు ఉపయోగపడుతుంది. చెన్నై వరదలు, నేపాల్ భూకంపం, ప్యారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం సందర్భాల్లో కూడా ఈ సేఫ్టీచెక్ ఫీచర్ యాడ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.