: నెల రోజుల క్రితమే వివాహం... అంతలోనే ఆత్మహత్య చేసుకున్న మోడల్ ప్రియాంకా కపూర్
నెల రోజుల క్రితం వివాహమైన ఓ మోడల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ఏరియాలో కలకలం సృష్టించింది. మోడల్ గా రాణిస్తున్న ప్రియాంకా కపూర్ (25) తన ఇంట్లో విగతజీవిగా పడివుండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె 25 అర్ధరాత్రి తరువాత, 26 తెల్లవారుఝాములోపు మరణించివుండవచ్చని భావిస్తున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, కట్నం విషయంలో భర్త నితిన్ చావ్లా వేధింపులను తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణించే ముందు ప్రియాంక రాసిన ఆత్మహత్యా లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త చావ్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఇంతకుముందే ఓ వివాహం చేసుకున్న చావ్లా, మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ప్రియాంకను చేసుకున్నాడు. ఈయన దక్షిణ ఢిల్లీలోని ఓ పబ్ ను నిర్వహిస్తూ, ఉక్కు వ్యాపారాన్ని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.