: ‘బాహుబలి’ సిగలో మరో కలికితురాయి ... జాతీయ ఉత్తమ చలన చిత్రంగా ఎంపిక
భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టిన తెలుగు చిత్ర రాజం ‘బాహుబలి’ మరో ఘనతను సాధించింది. వసూళ్లలో హిందీ చిత్రాల రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులను లిఖించిన ఈ చిత్రం తాజాగా జాతీయ ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది. 63వ జాతీయ చలన చిత్ర అవార్డులను కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, సత్యారాజ్, నాజర్... ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సత్తా చాటింది. ఇక ఉత్తమ నటుడిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(పీకూ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్), ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీ(బాజీరావ్ మస్తానీ) ఎంపికయ్యారు.