: యాంకర్ ప్రశ్నకు అగ్గిమీద గుగ్గిలమైన వైగో... మైక్ తీసేసి వెళ్లిపోయిన వైనం!
తాను స్వయంగా చేసిన ఆరోపణలపై ఓ యాంకర్ ప్రశ్నించిన వేళ, ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) సమన్వయకర్త వైగో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తనకు పెట్టిన బటన్ మైకును తీసేసి రుసరుసలాడుతూ, ఇంటర్వ్యూ మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. ఈ ఘటన పాలిమర్ టీవీ చానల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో జరిగింది. "మీ కూటమిని 'అన్నాడీఎంకే బీ టీమ్' అని పిలవచ్చా? మీకు జయలలిత నుంచి రూ. 1500 కోట్లు వచ్చాయన్న ప్రచారంపై ఏమంటారు?" అని ప్రశ్నిస్తుండగా, ఆగ్రహంతో లేచిన ఆయన ఇంటర్వ్యూ రద్దయినట్టే అంటూ, కాలర్ మైక్ తీసేసి వెళ్లిపోయారు. తన ప్రశ్న పూర్తిగా వినాలన్న యాంకర్ మాటలనూ ఆయన పక్కనబెట్టారు. కాగా, తమపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ, వైగోకు కరుణానిధి నిన్న నోటీసులు పంపారు. విజయ్ కాంత్ పార్టీని తమతో కలుపుకునేందుకు కరుణానిధి బేరమాడారని వైగో ఆరోపించిన సంగతి తెలిసిందే.