: 65 నుంచి 45కు దిగిన కాంగ్రెస్... 30 దాటని డీఎంకే... పొత్తుపై ప్రతిష్ఠంభన!
తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దిశగా గత మూడు నాలుగు రోజులుగా ఇరు పార్టీల మధ్యా జరుగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. తమకు 65 సీట్లు కావాలని శుక్రవారం నాడు జరిగిన చర్చల సందర్భంగా గులాంనబీ ఆజాద్ స్వయంగా చెన్నై వచ్చి కరుణానిధి ముందు డిమాండ్ ఉంచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గత పొత్తులో భాగంగా 30 సీట్లు కేటాయించామని, ఇప్పుడూ అంతే ఇస్తామని డీఎంకే చెబుతోంది. ఆపై తమిళ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని సంప్రదించి 45 సీట్లకు తగ్గకూడదని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని డీఎంకే ముందుంచగా, దానికి కూడా డీఎంకే ససేమిరా అంటున్నట్టు సమాచారం. మరో మెట్టు దిగిన కాంగ్రెస్ మూడు నాలుగు సీట్లు తగ్గినా అంగీకరించాలని భావిస్తూ చర్చలు జరపాలని భావిస్తుండగా, తొలి జాబితాలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను డీఎంకే ప్రకటించి మరో అడుగు ముందుకేసింది.