: వాడేసిన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్... అవాక్కవుతున్న దిగ్గజ కంపెనీలు!


హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్... ఓ ఐటీ ఉద్యోగి. ఎంట్రీ లెవల్ లో రూ. 3 లక్షల వరకూ పెట్టి ఓ కారును కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఈ సెగ్మెంట్ లో మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, రెనాల్ట్ క్విడ్ తదితర మోడల్లో చూశాడు. పెద్దగా సంతృప్తి పొందని కిరణ్, తన సెర్చ్ ని ఆన్ లైన్ వైపు మళ్లించాడు. ఆశ్చర్యం... ఉపయోగించిన కార్లు, సర్టిఫైడ్ కార్లు, ఏడాది వరకూ వారంటీ ఉన్న కార్లు వందలాది కనిపించాయి. ఓ ఈ-కామర్స్ వెబ్ సైట్ నుంచి అమ్మకందారుతో బేరమాడి ఓ మారుతి సుజుకి వాగన్ ఆర్ కొనుగోలు చేశాడు. బేరమాడటం ద్వారా వెబ్ సైట్లో ఉన్న ఆఫర్ ధర కన్నా మరో రూ. 20 వేలు ఆదా చేసుకున్నాడు కూడా. కిరణ్ మాదిరిగానే సెకండ్ హ్యాండ్ సర్టిఫైడ్ కార్లను కొనుగోలు చేస్తున్న వారెందరో ఉన్నారు. ఇండియాలో దాదాపు 42 లక్షల ఉపయోగించిన కార్లు చేతులు మారాయని తెలుస్తోంది. క్రిసిల్ లెక్కల ప్రకారం, గత సంవత్సరం రికార్డు స్థాయిలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు సాగగా, వాహన కంపెనీలు ఆ మేరకు నష్టపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం కొత్త, ఉపయోగించిన కార్లకు డిమాండ్ 1:1.2గా ఉండగా, ఇప్పుడది 1:2.2కు పెరిగింది. అంటే, ప్రతి 10 కొత్త కార్లు అమ్ముడవుతుంటే, 22 పాత కార్ల యాజమాన్యం మారుతోంది. గతంలో సగటున ఆరేళ్లు వాడిన తరువాత కార్లను విక్రయిస్తుండగా, అది ఇప్పుడు మూడేళ్లకు తగ్గిందని. మూడు నుంచి నాలుగేళ్లు వాడిన కారుకు అసలు ధరతో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకూ తక్కువ ధరకే లభిస్తోందని వాహన నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, మారుతున్న జీవన విధానం కార్ల అమ్మకాలను పెంచుతున్నాయని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అజయ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలపై కన్నేసిన మహీంద్రా, మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు స్వయంగా రంగంలోకి దిగి, మార్కెట్లో తమ అవకాశాలను మెరుగుపరచుకుంటున్నాయి. మహీంద్రా ఫస్ట్ చాయిస్, మారుతి ట్రూ వాల్యూ, హ్యుందాయ్ హెచ్ ప్రామిస్, కార్ నేషన్ ఆటో వంటి కంపెనీలు, యూజ్డ్ కార్లకు రుణ సౌకర్యం నుంచి వారంటీ వరకూ అన్ని సదుపాయాలనూ దగ్గర చేశాయి. కాగా, గడచిన ఐదు సంవత్సరాల్లో వాడేసిన కార్ల అమ్మకాలు సాలీనా 15 శాతం వృద్ధితో సాగుతూ వచ్చాయని క్రిసిల్ వెల్లడించింది. అయినప్పటికీ, అభివృద్ధి చెందిన యూఎస్, యూరప్ దేశాలతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇండియాలో మరింతగా పుంజుకోవాల్సి వుందని క్రిసిల్ అంచనా వేసింది. యూరప్, అమెరికాల్లో ప్రతి మూడు యూజ్డ్ కార్ల అమ్మకాలకు, ఒక కొత్త కారు అమ్మకం నమోదవుతోందని, దీన్ని బట్టి ఇండియాలో మార్కెట్ విస్తరణకు అవకాశాలు అపారమని పేర్కొంది. ఇక ఈ పరిస్థితితో అవాక్కవుతూ, గణాంకాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆటో ఇండస్ట్రీ కొత్త వాహన అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తగ్గింపు ధరలు, వారంటీ పొడిగింపు, ఉచిత యాక్సెసరీలు వంటి ఆకర్షణీయ హామీలు గుప్పిస్తున్నాయి.

  • Loading...

More Telugu News