: లిబియాలో రాకెట్ దాడి... భారత మహిళ, ఆమె బిడ్డ మృతి
లిబియాపై జరిగిన రాకెట్ దాడిలో భారతదేశానికి చెందిన ఓ నర్స్, ఆమె బిడ్డ మరణించారని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. ట్రిపోలీకి 45 కిలోమీటర్ల దూరంలోని జావియా ప్రాంతంలో ఈ దురదృష్టకర ఘటన జరిగిందని తెలిపారు. కేరళకు చెందిన సును సత్యం అనే నర్స్, ఆమె బిడ్డ తమ అపార్ట్ మెంట్ లోనే రాకెట్ దాడికి గురై మరణించినట్టు సుష్మ తెలియజేశారు. ఆమె భర్త విపిన్ కు సమాచారం అందించామని, జావియాలోని ఆసుపత్రిలో మరో 26 మంది భారతీయులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, వారందరి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను వీడాలని భారతీయులకు సలహా ఇచ్చినట్టు వెల్లడించారు.