: భక్తజనసంద్రంతో కిటకిటలాడుతున్న తిరుమల
వారాంతంతో పాటు వరుస సెలవులు కలసి రావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవదేవుని దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏడు కొండలపై శుక్రవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం నాడు మొత్తం 82,071 మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. కాగా, ఈ ఉదయం కాలినడకన వచ్చిన భక్తులకు దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయి ఉన్నాయి. భక్తుల అవసరాలను తీర్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.