: భారీ షాట్లతో విరుచుకుపడ్డ బట్లర్...శ్రీలంక లక్ష్యం 172
జార్జ్ బట్లర్ శ్రీలంక బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. బంతికి రెండు పరుగులు చొప్పున సాధించి ఇంగ్లండ్ స్కోరు అమాంతం పెంచేశాడు. అతని ధాటికి చివరి ఐదు ఓవర్లలో 14.40 రన్ రేట్ తో శ్రీలంక పరుగులు సమర్పించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆరంభంలోనే హేల్స్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం రాయ్ (42), రూట్ (25) జట్టును ఆదుకున్నారు. అనంతరం వచ్చిన బట్లర్ (66) శివాలెత్తాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. లంకేయులు వేసిన ప్రతిబంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనికి మోర్గాన్ (22) జత కలవడంతో భారీ షాట్లతో అభిమానులను అలరించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వాడెర్సె రెండు వికెట్లతో రాణించగా, ఒక వికెట్ తీసి హెరాత్ ఆకట్టుకున్నాడు. 172 పరుగుల విజయ లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది.